హైదరాబాద్:
నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల వైఖరుల వల్ల
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఇరుకున పడ్డారా అంటే అవుననే అంటున్నారు.
తనకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎక్కడ మంచి ఫ్యూచర్
ఉండదో అనే భావనతో జూఎన్టీఆర్
తన దారి చూసుకుంటున్నారనే వాదనలు
వస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ
ముందు ముందు తనకు టిడిపిలో
సరైన ప్రాధాన్యం లేకుంటే ఒంటరిగానే రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే
ఉద్దేశ్యంతో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే.
తన తురుపు ముక్క విజయవాడ పట్టణ
అధ్యక్షుడు వల్లభనేని వంశీతో ఓసారి జూనియర్ ప్రయోగం
చేశారని అంటున్నారు. గతంలోనూ చంద్రగిరి నియోజకవర్గానికి బాబు తనయుడు లోకేష్
కుమార్ను ఇంచార్జిగా చేయాలన్న
ప్రతిపాదనకు ధీటుగా జూనియర్ను కూడా మరో
నియోజకవర్గం నుండి రంగంలోకి దింపే
ప్రయత్నాలు ఎన్టీఆర్ వర్గం నేతలు చేశారు.
దీంతో బాబు అప్పటికి లోకేష్
విషయంలో వెనక్కి తగ్గారు.
కానీ
ఆ తర్వాత జూనియర్ తండ్రి హరికృష్ణ పలుమార్లు చంద్రబాబుపై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలకు దిగారు. ఆయనపై తన అసంతృప్తిని
వెళ్లగక్కారు. హరికృష్ణ సూచనల మేరకు ఇటీవల
జూనియర్ రంగంలోకి దిగి బాబును మరింత
ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. లోకేష్ పేరు తెరపైకి వచ్చినప్పటి
నుండి ఈ తండ్రి కొడుకులు
బాబును ఏదో రకంగా టార్గెట్
చేసుకున్నారని అంటున్నారు.
బాబుకు
వీరిద్దరు ఇలా తలనొప్పులు కలిగిస్తుంటే,
అండగా ఉంటున్నప్పటికీ బాలకృష్ణ మరోరకంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. జూనియర్కు ప్రత్యామ్నాయంగా రంగంలోకి
దిగుతున్న బాలకృష్ణ పార్టీలో రెండో పవర్ సెంటర్గా మారుతూ బాబును
చిక్కుల్లో పడేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలలో టిక్కెట్లు మొదలు నియోజకవర్గ ఇంచార్జుల
వరకు బాలయ్య కలుగ చేసుకోవడం వల్ల
బాబుకు ఎటూ పాలుపోవడం లేదనే
వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల
అనంతపురం నియోజకవర్గం నుండి ప్రభాకర్ చౌదరికి
టిక్కెట్ ఇవ్వాలని బాబు భావించారు. జిల్లా
నేతలు కూడా సరే అన్నారు.
అయితే చివరి నిమిషంలో బాలయ్య
రంగంలోకి దిగి మహాలక్ష్మి శ్రీనివాస్కు టిక్కెట్ ఇప్పించారట.
ఆ తర్వాత ఖమ్మం జిల్లా కొత్తగూడెం
నియోజకవర్గం ఇంచార్జ్ విషయంలోనూ ఆయన కలుగు జేసుకోవడంతో
నియామకం వాయిదా పడిందని అంటున్నారు. స్థానికంగా చాలామంది వ్యతిరేకించే నేతకు బాలయ్య తన
మద్దతి ఇచ్చారట.
అంతేకాదు
ప్రతి జిల్లాలో తన వర్గం వారు
ఎంతో కొంతమంది ఉండాలనే నిశ్చయంతో బాలయ్య ఉన్నారట. అందులో భాగంగా ఆయన తన వారికి
సిఫార్సు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు బాబు వద్ద నెగ్గించుకోలేని
వారు బాలయ్య వద్దకు వెళ్లి అధినేతకు చిక్కుల్లో పెడుతున్నారట. దీంతో వియ్యంకుడైన బాబుకు
కష్టాల్లో అండగా ఉంటున్నప్పటికీ తనకు
తెలియకుండానే బాలకృష్ణ ఆయనకు మరింత ఇబ్బందుల్లోకి
నెడుతున్నారా అనే చర్చ జరుగుతోందట.
గత సాధారణ ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం వారికి
టిక్కెట్లు ఇప్పించుకోవడానికి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా
బాలకృష్ణ సిఫార్సులు చేస్తున్నారని అంటున్నారు. ఇటు జూనియర్ విభేదాలు,
అటు బాలయ్య సిఫార్సుల మధ్య చంద్రబాబు నలిగి
పోతున్నారనే వాదన వినిపిస్తోంది.
0 comments:
Post a Comment