హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ రాజకీయాల విషయంలో ప్రముఖ సినీ హీరో జూనియర్
ఎన్టీఆర్ వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే తనకు తెలుగుదేశం పార్టీతో
విభేదాలు లేవని స్పష్టం చేసిన
తర్వాత మౌనంగా ఉండిపోయారని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న
నేపథ్యంలో విభేదాలను పైకి తేవడం సరి
కాదని, ఒక వేళ ఉప
ఎన్నికల్లో పార్టీ తగిన ఫలితాలు సాధించకపోతే
నిందలు తమపైనే పడుతాయని భావించి జూనియర్ ఎన్టీఆర్ వర్గం వెనక్కి తగ్గినట్లు
తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఉప ఎన్నికల్లో పార్టీ తగిన ఫలితాలు సాధించకపోతే
పార్టీ నాయకత్వంపై పోరాటాన్ని పెంచవచ్చునని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు, ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ వర్గం పార్టీలో సిద్ధంగా
ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ తగిన ఫలితాలు సాధించకపోతే
పార్టీ నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ ఊపందుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక వేళ ఉప ఎన్నికల్లో
తగిన ఫలితాలు సాధిస్తే 2014 వరకు ఆగాలనే ఉద్దేశంతో
జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం పట్ల పార్టీలోని ఓ
వర్గం తీవ్ర ఆసంతృప్తితో ఉంది.
ఇందుకు సంబంధించి అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే, అవి తలెత్తకుండా తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నారు.
తెలుగుదేశం
పార్టీతో తనకు విభేదాలు లేవంటూ
చేసిన ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించలేదు.
పార్టీ వ్యవస్థాపకుడైన తాత స్వర్గీయ ఎన్టీ
రామారావు పేరును మాత్రమే పదేపదే ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ మామకు చెందిన టీవీ
చానెల్ ప్రసారాలపై తెలుగుదేశంలోని ఓ వర్గం తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల సందర్భంగా
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య విభేదాలకు టీవీ
చానెల్ ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు.
విజయవాడ
నడిరోడ్డుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
ఆలింగనం చేసుకోవడంపై తీవ్ర దుమారం చెలరేగిన
విషయం తెలిసిందే. వంశీ చర్య వెనక
జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ సమయంలో జూనియర్
ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాకు కాస్తా
కష్టాలు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ తర్వాత ఉప
ఎన్నికల ఫలితాల నిందను దృష్టిలో ఉంచుకుని జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గారని, వంశీతో తనకు ఏ విధమైన
సంబంధం లేదని ప్రకటించారని అంటున్నారు.
0 comments:
Post a Comment