కడప:
తన మీడియాలో పెట్టుబడులు పెట్టిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ్ముడిని అరెస్టు చేయగలరా అని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రశ్నించారు.
ఆయన తన ఎన్నికల ప్రచారంలో
భాగంగా శుక్రవారం కడప జిల్లా రైల్వే
కోడూరులో ప్రసంగించారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టారని నిమ్మగడ్డ ప్రసాద్ను తీసుకుని వెళ్లి
జైల్లో పెట్టారని, ల్యాంకో గ్రూపునకు చెందిన లగడపాటి తమ్ముడు కూడా సాక్షిలో పెట్టుబడులు
పెట్టారని, రాజగోపాల్ తమ్ముడిని జైల్లో పెట్టే ధైర్యం ఉందా అని సిబిఐని,
కాంగ్రెసు పెద్దలను, చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు.
కాంగ్రెసు
పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
కుమ్మక్కై అధికారాన్ని దుర్వినియోగాన్ని చేస్తున్నాయని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని
ఆయన విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కోవడం
చేత కాక అణగదొక్కాలని చూస్తున్నారని
ఆయన అన్నారు. వీరిద్దరూ కలిసి చివరకు సిబిఐ
దర్యాప్తును సైతం మేనేజ్ చేస్తున్నారని
ఆయన విమర్శించారు. కాంగ్రెసు, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ... అందరూ ఒక్కటై సాక్షి
పత్రిక, సాక్షి టీవీని మూసేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన
ఆరోపించారు.
చార్జిషీట్ను సిబిఐ కోర్టుకు
ఇవ్వక ముందే అందులో ఏముందో
ఈనాడు దినపత్రికలో పతాక శీర్షిక కింద
వస్తోందని ఆయన అన్నారు. సిబిఐ
చార్జిషీట్ రూపొందించి కోర్టుకు దాఖలు చేస్తుందని, తర్వాత
సంబంధిత వ్యక్తులకు దాన్ని ఇవ్వాలని కోర్టు చెబుతుందని, కోర్టు దాన్ని ఇచ్చే వరకు అందులో
ఏముందో ఎవరికీ తెలియదని, అయితే ఆశ్చర్యకరంగా కోర్టుకు
చార్జిషీట్ను సమర్పించక ముందే
ఈనాడు దినపత్రికలో వచ్చేస్తోందని ఆయన అన్నారు
రాష్ట్ర
రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార, ప్రతిపక్షాలు కలిసి కుమ్మక్కయ్యాయని ఆయన
విమర్శించారు. కాంగ్రెసు పెద్దలు, చంద్రబాబు కలిసి కోర్టుకు వెళ్తారని,
వెళ్లి కలిసి కేసులు వేస్తారని,
మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డిని
అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తారని,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీ చేస్తారని ఆయన
వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment