హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని సిబిఐ
తెలిపింది. శుక్రవారం ఉదయం వైయస్ జగన్
కస్టడీ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు
వాడిగా వేడిగా జరిగాయి. ఈ సందర్భంగా సిబిఐ
తరఫు న్యాయవాది మాట్లాడారు. జగన్ అరెస్టు తర్వాత
కీలక సాక్ష్యాలు లభించాయని చెప్పారు. అంతకుముందు సాక్ష్యాలను తారుమారు చేసే యత్నం జరిగిందన్నారు.
ఈ కేసులో నిందితులైన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలు కస్టడీలో కొన్ని కీలక విషయాలు తెలియజేశారని
చెప్పారు. ముగ్గురు కీలక సాక్ష్యాలతో తమ
ముందుకు వచ్చారన్నారు. ఆధారాలు ఇచ్చిన ముగ్గురి పేర్లు ప్రస్తుతానికి వెల్లడించలేమన్నారు. జగన్ మూడు రోజుల
తమ విచారణలో నోరు మెదపలేదని చెప్పారు.
ఏమడిగినా తనకేం తెలియదని చెప్పారని,
అన్నీ జగతి పబ్లికేషన్స్ వైస్
చైర్మన్ విజయ సాయి రెడ్డికే
తెలుసునని చెప్పారన్నారు.
వైయస్
జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం కంటే ముందే
మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను
అరెస్టు చేసినట్లు కోర్టు దృష్టికి సిబిఐ తరఫు న్యాయవాది
తీసుకు వెళ్లారు. జగన్ కంపెనీలలోకి హవాలా
రూపంలో విదేశాల నుండి పెట్టుబడులు వచ్చాయని
తెలిపారు. మొదటి మూడు ఛార్జీషీట్లు
జారీ చేసినప్పుడు జగన్ విచారణ అవసరం
పడలేదని, అందుకే అతనిని పిలవలేదని చెప్పారు. గతంలో ఢిల్లీ సిబిఐ
టాస్క్ ఫోర్స్ ఓ ఎఫ్ఐఆర్లో
30 ఛార్జీషీట్లు జారీ చేసిందన్నారు. జగన్తో సిబిఐకి ఎలాంటి
రాజకీయ కక్ష లేదన్నారు.
జగన్
కంపెనీలలోకి నిధుల మళ్లింపుపై విదేశీ
కంపెనీలకు లేఖలు రాసినట్లు చెప్పారు.
జగన్ అరెస్టు విషయంలో తమకు క్లారిటీ ఉందన్నారు.
ఖచ్చితమైన ఆధారాలతోనే అరెస్టు చేసినట్లు చెప్పింది. నేరస్తులు ఎవరైనా తాము సమాన దృష్టితోనే
చూస్తామన్నారు. జగన్ సంస్థలలోకి భారీగా
నిధులు వచ్చాయని తెలిపారు. జగన్ను తమ
కస్టడీకి పదిరోజులు ఇవ్వాలని కోరారు. కాగా నాంపల్లి ప్రత్యేక
కోర్టు జగన్ బెయిల్ పిటిషన్
తీర్పును మరికొద్దిసేపట్లో వెలువర్చనుంది.
0 comments:
Post a Comment