మెదక్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్లలో
చేపట్టిన చేనేత దీక్ష కేవలం
ఇరవై నిమిషాలలో ముగిసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ఎద్దేవా
చేశారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం
తూతూ మంత్రంగా మాత్రమే దీక్ష నిర్వహించారని విమర్శించారు.
సంగారెడ్డిలోని గంగా నర్సరీని సందర్శించిన
కవిత అనంతరం విలేకరులతో మాట్లాడారు.
20 నిమిషాల్లో
ముగించిన విజయమ్మ దీక్షతో చేనేత కార్మికులకు ఒరిగిందేమిటో
తెలియడం లేదన్నారు. చేనేత కార్మికుల సమస్యల
కంటే తన తనయుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి జపమే ఎక్కువగా ఉందన్నారు.
హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వరకు
కొనసాగిన యాత్రలో అడుగడుగునా చెప్పులు చూపినా, రాళ్ల రువ్వినా యాత్రను
కొనసాగించడం వీరత్వం, ధీరత్వం కాదని, అది సిగ్గుమాలిన చర్య
అని కవిత ధ్వజమెత్తారు.
ఖమ్మం
జిల్లాలోని 300 గ్రామాలు ముంపునకు గురయ్యే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైయస్సార్ కాంగ్రెసు వైఖరి ఏమిటో ప్రజలకు తెలపాలని
డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో
ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడుతోందని
వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment