హైదరాబాద్:
తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాయాలని తమ
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును
తాము కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి
దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు
బుధవారం అన్నారు. ఉదయం టి-టిడిపి
నేతలతో చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో సమావేశమయ్యారు.
అనంతరం
వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయమై బాబు అన్ని ప్రాంతాల
నేతలతో మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ కోసం లేఖ రాయాలని
చెబితే అందుకు ఆయన స్పందించారన్నారు. తెలంగాణ
రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల
చంద్రశేఖర రావు మాయమాటలు, మోసపు
మాటలు నమ్మి వందలాది యువకులు,
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తుందంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసుతో
చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగులో భాగమన్నారు.
తెలంగాణ
కోసం ఆత్మత్యాగం చేసుకున్న వారికి తాము గతంలో చెప్పినట్లుగా
ఈ నెల 30వ తేదిన
ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు.
జిల్లా అధ్యక్షుడు లేదా మండల అధ్యక్షుల
చేతుల మీదుగా దీనిని బాధిత కుటుంబాలకు అందేలా
చూస్తామన్నారు. కెసిఆర్ మాటలు నమ్మకూడదన్నారు. తెలంగాణ
ప్రజల పక్షాన టి-టిడిపి పోరాడుతుందని
వారు ఈ సందర్భంగా చెప్పారు.
మరోవైపు
యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణవాదులు ఎవరూ ఓటేయవద్దని తెలంగాణ
నగారా సమితి చైర్మన్ నాగం
జనార్ధన్ రెడ్డి సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేని ప్రణబ్‌కు
ఓటేస్తే వారు తెలంగాణ ద్రోహులే
అన్నారు. కాంగ్రెసు నేతలు కూడా వారి
ఆత్మ ప్రభోదానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. నాగం, హరీశ్వర్ రెడ్డి,
వేణుగోపాల చారిలు ఎన్డీయే అభ్యర్థి పిఏ సంగ్మాకు ఓటేయనున్నారు.
0 comments:
Post a Comment