న్యూఢిల్లీ:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు జెడి శీలం తీవ్ర
వ్యాఖ్యలు చేశారు. దళితులను మోసం చేసిన వైయస్
విగ్రహాలను దళితవాడల్లో పెట్టడం బాధాకరమని ఆయన ఆదివారం అన్నారు.
దళిత సంక్షేమానికి ఉద్దేశించిన రూ.13 వేల కోట్లను
దారి మళ్లించి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు తూట్లు పొడిచారని
దుయ్యబట్టారు. సబ్ప్లాన్ అమలులో
మూడు దశాబ్దాల అన్యాయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
సవరించారని కొనియాడారు.
రాష్ట్రంలో
ఎస్సీలకు చంద్రబాబు, వైయస్ హయాంలో తీరని
ద్రోహం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు రూ.10 వేల కోట్లను
దళితుల నిధులను ఇతర పథకాలకు ఖర్చు
చేయగా, వైయస్ రూ.13 వేల
కోట్లను దారి మళ్లించారన్నారు. ఎస్టీలకు
చెందిన మరో రూ.4వేల
కోట్లను కూడా మళ్లించారన్నారు. మిగిలిన
కొద్దిపాటి నిధులను ఖర్చు చేయకపోవడంతో అవి
వృథా అయ్యాయని చెప్పారు.
ఎన్నోసార్లు
దళితుల సంక్షేమం కోసం సూచనలు చేసినా
వైయస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. దళిత కాలనీల్లో
రోడ్లు, పారిశుధ్యం, గృహ నిర్మాణం, భూ
సేకరణ, నష్టపరిహారం పెంపు, సబ్ప్లాన్ అమలు,
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, చిన్నచిన్న కాంట్రాక్టుల మంజూరు తదితరాలను ఆయన దృష్టికి తీసుకు
వెళ్లానని, చివరకు దళితులకు ఆయన శ్మశానాలు కూడా
లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
వైయస్
హయాంలో ఎస్సీ సబ్ప్లాన్ను సవ్యంగా అమలు
చేయలేదని ప్లానింగ్ కమిషనే తప్పుపట్టిందని, రాష్ట్ర ప్రతిపాదనల్ని వెనక్కు పంపిందని గుర్తు చేశారు. అదే సబ్ప్లాన్ను కిరణ్ సవరించారన్నారు.
సోనియా దృష్టికి సబ్ప్లాన్ వ్యవహారాన్ని
తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి ప్రధానికి లేఖ రాశారన్నారు. దళితవాడల్లో
అంబేద్కర్ విగ్రహాల కంటే పెద్దగా వైయస్
విగ్రహాలు పెట్టడం బాధాకరమన్నారు.
దళితులు
ఆలోచనలుగల, వివేకవంతమైన వారని, నిజాలు తెలిస్తే సరైన నిర్ణయం తీసుకుంటారని
చెప్పారు. దళితులకు వాస్తవాలు చెబుతూ పార్టీ ప్రచార కార్యక్రమం రూపొందించాలన్నారు. కాంగ్రెస్ మాత్రమే దళితులను అభివృద్ధి చేయగలదని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా దళితులు
గొర్రెమందలా ఇప్పుడు లేరని బాగా ఆలోచిస్తున్నారని
అన్నారు. అయితే వారికి కొన్ని
నిజాలు తెలియజేయాల్సి ఉందన్నారు.
దళితుల్లో
అత్మాభిమానం ఉన్న ఎవరైనా చిన్న
చిన్న పార్టీల్లో ఎక్కువ కాలం ఉండలేరన్నారు. తెలుగుదేశం,
భారతీయ జనతా పార్టీల వంటి
మిగతా పార్టీల్లో చాలామంది దళిత నాయకులు ఉన్నప్పటికీ
అక్కడున్న పరిస్థితుల వల్ల మాట్లాడలేక పోతున్నారన్నారు.
0 comments:
Post a Comment