తిరుపతి: తెలుగుదేశం పార్టీ చిత్తూరు లోకసభ సభ్యుడు డాక్టర్
ఎన్ శివప్రసాద్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు తిరుపతి పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు.
ఆయన కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం జరిగిన
చర్చలకు కూడా ఆయన దూరంగా
ఉన్నారు. కాంగ్రెసులో చేరాలనే ఉద్దేశంతో ఉండడం వల్లనే ఆయన
తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
గత కొంత కాలంగా శివప్రసాద్
మంత్రి గల్ల అరుణకుమారి కార్యక్రమాలకు
హాజరవుతున్నారు. గల్ల అరుణ కుమారిని,
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని
ఆయన ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, గల్లా అరుణ కుమారి
ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం తన చిత్తూరు లోకసభ
స్థానంలో ఉండడం వల్ల తాను
ఆ కార్యక్రమాలకు హాజరువుతున్నట్లు శివప్రసాద్ చెబుతున్నారు.
మంచి
పనులు చేసినప్పుడు మంచి అని చెప్పకపోతే
ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని ఆయన కాంగ్రెసును సమర్థించడానికి
అవసరమైన వాదనను వినిపిస్తున్నారు. అందువల్ల శివప్రసాద్ ఏదో ఒక రోజు
కాంగ్రెసులోకి జారకోవడం ఖాయమనే ప్రచారం ముమ్మరమైంది. శివప్రసాద్ వ్యవహారంపై పూర్తి వివరాలతో జిల్లా నాయకులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
ఇప్పటికే ఓ లేఖ రాశారు.
దానిపై
చంద్రబాబు శివప్రసాద్ను వివరణ కోరినట్లు,
ఆయన వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాలంటే అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉండక
తప్పదని ఆయన చంద్రబాబుకు వివరణ
ఇచ్చినట్లు చెబుతున్నారు. రానున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారానికి
చంద్రబాబు తిరుపతి నుంచి సోమవారం శ్రీకారం
చుట్టారు. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి
శివప్రసాద్ హాజరు కాలేదు. అందువల్ల
శివప్రసాద్ మానసికంగా తెలుగుదేశం పార్టీకి దూరమైనట్లేనని భావిస్తున్నారు.
తిరుపతి
స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో
తన కుమారుడు గల్లా జయదేవ్ను
కాంగ్రెసు అభ్యర్థిగా పోటీకి దించాలని గల్లా అరుణ కుమారి
అనుకుంటున్నారు. దీంతో తిరుపతిలోనే కాకుండా
చిత్తూరు జిల్లాలో ఇతర పార్టీల నాయకుల
మద్దతు సంపాదించడానికి ఆమె తీవ్ర కృషి
చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఎంపి శివప్రసాద్ను
కాంగ్రెసు వైపు తీసుకు రావడానికి
కృషి చేస్తున్నారని అంటున్నారు.
0 comments:
Post a Comment