హైదరాబాద్:
మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిపై
పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు
తీసుకునేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలో రంగం సిద్ధమవుతోంది. గత
కొంతకాలంగా ఆయన పార్టీకి వ్యతిరేకంగా
విమర్శలు చేస్తున్నారని కరీంనగర్ జిల్లాకు చెందిన పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మృత్యుంజయం ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి పైన జీవన్ రెడ్డి
చేసిన విమర్శలు, 2014లో వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఆయన ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేస్తారని జీవన్ రెడ్డి చేసిన
వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికా క్లిప్పింగులను ఈ ఫిర్యాదుతో పాటు
మృత్యుంజయం జతపరిచినట్లుగా సమాచారం.
దీనిపై
స్పందించిన పిసిసి అధ్యక్షుడు బొత్స వెంటనే విచారణ
చేసి నివేదిక ఇవ్వాలని పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కంతేటి
సత్యనారాయణకు సూచించారు. రెండు మూడు రోజుల్లో
ఆ కమిటీ సమావేశమైన జీవన్
రెడ్డికి నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా ఇటీవల జీవన్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
అనుకూలంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అదే
సమయంలో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో
విరుచుకు పడ్డారు.
ఇటీవల
జగన్ 'రెడ్డి' విషయమై చర్చకు వచ్చిన సందర్భంలో ఆయన తమ పార్టీలోనే
అసలు రెడ్లున్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెడ్డి
అవునా, కాదా అనే చర్చ
అనవసరమని అన్నారు. కిరణ్ కుమార్ కనీసం
రెడ్లను కూడా ఆకర్షించలేకపోతున్నారని ఆయన తప్పు
పట్టారు. రెడ్డి అయి ఉండి కూడా
తన వెంట రెడ్లు రావడం
లేదని కిరణ్ కుమార్ రెడ్డి
అంటున్నారంటే ఏ విధమైన అభిప్రాయం
కలుగుతుందని ఆయన అన్నారు.
రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉండి రెడ్లు కాంగ్రెసు
వెంట రావడం లేదంటే ఎలా
అని ఆయన అడిగారు. కిరణ్
కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పార్టీలో
చీలిక ప్రారంబమైందని ఆయన అన్నారు. కిరణ్
కుమార్ రెడ్డి మాటలు కాంగ్రెసు శ్రేణులను
నిరాశకు గురి చేస్తున్నాయని ఆయన
అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన
ముహూర్తం బాగా లేదని, మూడు
నెలలకు ఒకసారి ఎన్నికలు వస్తుండడం వల్ల ఏమీ చేయలేకపోతున్నానని
ముఖ్యమంత్రి అంటున్నారని, ఈ విధమైన మాటల
వల్ల కాంగ్రెసు శ్రేణులకు ఏ విధమైన అభిప్రాయం
ఏర్పడుతుందని ఆయన అన్నారు.
తెలంగాణపై
కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు
వ్యతిరేకంగా సీమాంధ్రలో చర్చ జరగడం వెనక
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఉన్నారని ఆయన అన్నారు. అంతకుముందు
కూడా ఆయన వైయస్ జగన్మోహన్
రెడ్డిని ఎదుర్కునే దమ్ము సీమాంధ్రలో తమ
పార్టీకి లేదని అన్నారు.
తెలంగాణలో
కాంగ్రెసుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎదుర్కునే
సత్తా ఉందన్నారు. మహబూబ్నగర్లో పార్టీ
ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కారణమని ఆయన అన్నారు. జీవన్
రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి
అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జీవన్ రెడ్డి వైయస్
జగన్ వెంట వెళ్తారనే ప్రచారం
ముమ్మరంగానే ఉంది. అయితే, ఆయన
ఆ విషయం గురించి మాట్లాడడం
లేదు.
0 comments:
Post a Comment