నిమ్మగడ్డ
ప్రసాద్ కాస్తా మ్యాట్రిక్స్ ప్రసాద్గా ప్రాచుర్యంలోకి వచ్చారు.
రాష్ట్రంలోని పైస్థాయి సర్కిల్లో ఆయన పేరు
మారుమోగుతూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా
పారిశ్రామిక రంగంలో వినిపిస్తున్న పేరు మ్యాట్రిక్స్ ప్రసాద్ది. ఫార్మా, ఓడరేవులు,
ఎంటర్టైన్మెంట్, ఆస్పత్రుల
రంగాల్లో ఆయన విస్తరిస్తూ వెళ్లారు.
పదేళ్ల కాలంలో ఆయన కోట్ల ఆస్తిపరుడిగా
ఎదిగారు. ఖాయిలా పడిన పరిశ్రమలను తన
చేతుల్లోకి తీసుకుని అత్యంత వేగంతో వాటిని లాభాల పట్టించిన చేయి
ఆయనది.
కృష్ణా
జిల్లాలో 1961లో జన్మించిన ప్రసాద్
వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఫార్మా రంగంలో 1984లో సాధారణ ఉద్యోగిగా
జీవితం ప్రారంభించారు. 16 ఏళ్లపాటు ఉద్యోగ జీవితంలోనే ఉన్నారు ప్రసాద్. 2000 సంవత్సరంలో ఖాయిలా పడిన సింగిల్ ప్రాడక్ట్
కంపెనీ హెరెన్ డ్రగ్స్ను కొనుగోలు చేయడం
ద్వారా వ్యాపార రంగంలో కాలు పెట్టారు. హెరెన్
పేరును మ్యాట్రిక్స్ లాబ్స్గా మార్చారు. అసాధారణ
తెలివి తేటలు, వ్యాపార వ్యూహాలతో దీనిని స్టాక్ మార్కెట్ డార్లింగ్ కంపెనీగా తీర్చిదిద్దారు. 2000 నుంచి 2006 మధ్య ఆరేళ్ల కాలంలో
ఈ మామూలు కంపెనీకి అసాధారణ వాల్యుయేషన్ కల్పించే క్రమంలో మెర్జర్ అక్విజిషన్స్ను ఒక వ్యాపార
వ్యూహంగా అమలు చేశారు.
వివిధ
పత్రికల్లో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - దేశంలోనూ బయటా కంపెనీలను కొనుగోలు
చేశారు. మెడికార్ప్ టెక్నాలజీస్, వొరిన్ లాబ్స్, వెరా లాబ్స్, ఫైన్
డ్రగ్స్ అండ్ కెమికల్స్, కాంకర్డ్
బయోటెక్ తదితరాల కొనుగోళ్లు, విలీనాల ద్వారా మ్యాట్రిక్స్ను అంతర్జాతీయ స్థాయికి
తీసుకుపోయారు. 2005లో బెల్జియం కంపెనీ
డాక్ ఫార్మాను కొనుగోలు చేయడంతోపాటు చైనా కంపెనీ మెక్
కెమ్లో వాటాల కొనుగోలు,
అదే ఏడాది దక్షిణాఫ్రికాలో జాయింట్
వెంచర్ ఏర్పాటు, స్విట్జర్లాండ్ కంపెనీ ఎక్స్ప్లోరాలో 43 శాతం
వాటా కొనుగోళ్లు ఫార్మా రంగంలో ఆయన స్థానాన్ని పటిష్ఠం
చేశాయి.
ఖాయిలా
పడిన పరిశ్రమలను తీసుకుని వాటిని పునరుద్ధరించి మ్యాట్రిక్స్ గొడుగు కిందకు తెచ్చి ఆయన చూపిన వ్యాపారదక్షతకు
భారత ఫార్మా రంగంలో పేరు గడించారు. 2006లో
మ్యాట్రిక్స్ను బహుళజాతి కంపెనీ
అయిన మైలాన్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలోనే ఆయనకు
వ్యక్తిగతంగా సుమారు 570 కోట్ల రూపాయలు లభించాయి.
ఈ డబ్బుతోనే, ఇన్వెస్టర్గా ఆయన పలు
కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. స్టార్టప్స్కు ఊతం ఇచ్చారు.
రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్
టీవీ చానల్స్లో ఒకటైన 'మా'
గ్రూప్లో ఆయనకు మెజార్టీ
వాటాలున్నాయి. ఈ సంస్థకు ఆయనే
చైర్మన్.
కేర్
హాస్పిటల్స్, ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
సహా అనేక కంపెనీలు, విద్య,
ధార్మిక సంస్థల్లో ఆయన కీలక స్థానాల్లో
ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్కు చెందిన
సాక్షిలో రూ.450 కోట్లు, భారతి సిమెంట్స్లో
రూ.252 కోట్లు, కార్మెల్ ఏసియాలో రూ.20 కోట్లు పెట్టుబడి
పెట్టారు. ఇందుకు ప్రతిఫలంగానే ఆయనకు వాన్పిక్
ప్రాజెక్టు (నిజాంపట్నం, వాడరేవు పోర్టు) లభించిందన్న ఆరోపణలున్నాయి. వాన్పిక్ ప్రాజెక్టుకు
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 2006-07లో శ్రీకారం చుట్టారు.
నిజాంపట్నం-వాడరేవు పోర్టుల మధ్య 15000-16000 ఎకరాల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే
పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేల కోట్ల రూపాయల
వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టుల్లో రస్
అల్ ఖైమా, నిమ్మగడ్డ ప్రసాద్ ముఖ్య భాగస్వాములు. రస్
అల్ ఖైమా అనేది యూఏఈలో
ఒక చిన్న ఎమిరేట్. అందువల్ల
వాన్పిక్ ప్రాజెక్టును రెండు
ప్రభుత్వాల మధ్య లావాదేవీగా పరిగణించి
బిడ్డింగ్ లేకుండా నేరుగా కేటాయించారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అండదండలూ అప్పటి
వైఎస్ ప్రభుత్వం నుంచి రస్ అల్
ఖైమా, ప్రసాద్ బృందానికి అందాయన్నది ఆరోపణ. రెండు రేవులు, పారిశ్రామిక
కారిడార్, పెద్ద ఎత్తున రియల్
ఎస్టేట్, విద్యుత్ ప్రాజెక్టు వంటి ఏర్పాటు కోసం
తలపెట్టిన ఈ ప్రాజెక్టు అలవోకగా
దక్కాయి. అందుకు ప్రతిఫలంగానే ఆయన వైయస్ జగన్
కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అంటారు. అత్యంత వేగంగా ఆకాశానికి తాకే స్థాయికి ఎదిగిన
మ్యాట్రిక్స్ ప్రసాద్ ఇప్పుడు సిబిఐ చేతిలో బందీ
అయ్యారు.
0 comments:
Post a Comment