హైదరాబాద్:
తమ మీడియా గ్రూప్ బ్యాంక్ ఖాతాల స్తంభనపై వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం
బ్యాంక్ ఖాతాల స్తంభనపై సిబిఐ
ప్రత్యేక కోర్టులో సాక్షికి చుక్కెదురైన విషయం తెలిసిందే.
దీంతో
సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సాక్షి
తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
దాఖలు చేశారు. వారి పిటిషన్ను
హైకోర్టు స్వీకరించింది. లంచ్ సమయం తర్వాత
ఈ పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఈనాడు దిన
పత్రికకు ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని
హైకోర్టు జూలైలో విచారణ చేపట్టనుంది. జగన్ ఆస్తుల కేసులో
మొదటి ఛార్జీషీట్ ఇవ్వాలన్న ఈడి పిటిషన్ పైన
నిర్ణయాన్ని సిబిఐ కోర్టు గురువారానికి
వాయిదా వేసింది. కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
చేసింది.
కాగా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాకు సిబిఐ ప్రత్యేక కోర్టులో
సోమవారం చుక్కెదురైన విషయం తెలిసిందే. తమ
బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలంటూ జగన్ మీడియా - జగతి
పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా
స్ట్రక్చర్స్, ఇందిరా టెలివిజన్లు వేసిన పిటిషన్లను సిబిఐ కోర్టు
కొట్టి వేసింది. జగన్ ఆస్తుల కేసు
దర్యాఫ్తు ఇంకా కొనసాగుతున్నందున ఖాతాల
స్తంభనను సమర్థించింది.
ఖాతాల
స్తంభన విషయంలో సిబిఐ వాదనతో కోర్టు
ఏకీభవించింది. నిందితుల జాబితాలో ఇందిరా టెలివిజన్ లేదని, అలాగే ఉద్యోగులు ఆధారపడి
ఉన్నారని, 102 సెక్షన్ మిస్ యూస్ చేశారన్న
జగన్ మీడియా వాదనతో కోర్టు విభేదించింది. ఇటీవల సిబిఐ జగన్
మీడియాకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేసిన విషయం తెలిసిందే.
జగతి పబ్లికేషన్కు చెందిన స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇందిరా
టెలివిజన్కు చెందిన ఓరియంటల్
బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తదితర ఖాతాలను సిబిఐ
స్తంభింప చేసింది.
దీనిపై
వారం రోజుల క్రితం సిబిఐ,
జగన్ మీడియా తమ తమ వాదనలను
కోర్టులో వినిపించాయి. వైయస్ జగన్ మీడియా
బుధవారం ఖాతాలు పునరుద్దరించాలంటూ పిటిషన్ దాఖలు చేయగా, సిబిఐ
గురువారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ
సందర్భంగా ఇరువర్గాలు కోర్టులో వాదనలు వినిపించాయి. సాక్షిని మూయించడమే సిబిఐ లక్ష్యంగా ఉందని
సాక్షి తరఫు న్యాయవాది అన్నారు.
102వ సెక్షన్ను వక్రీకరించారన్నారు. ఖాతాల స్తంభన
అసంబద్దమైన చర్య అని, కోర్టు
అనుమతులు లేకుండా ఎలా ఫ్రీజ్ చేస్తారని
ప్రశ్నించారు.
ఇది రాజకీయ కోణంలోనే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో
జగన్ను కట్టడి చేసేందుకు
సిబిఐ దీనిని అస్త్రంగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు. సిబిఐ
పరిధి తరఫు వ్యవహరిస్తోందని, దీని
వల్ల ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారని సాక్షి న్యాయవాది తెలిపారు. ఇప్పటి వరకు దాఖలు చేసిన
ఛార్జీషీటులలో తాము రూ.74 కోట్లను
గుర్తించామని సిబిఐ తరఫు న్యాయవాది
చెప్పారు.
అవసరమనుకుంటే
సాక్షి యాజమాన్యం కొత్తగా అకౌంట్లను తెరిచి లావాదేవీలు జరుపుకోవచ్చునని సూచించింది. ఇది చాలా పెద్ద
కుంభకోణమని, అతి తక్కువ కాలంలో
విచారణ పూర్తి చేయడం కుదరదని తెలిపింది.
అయితే సాక్షి ఖాతాలకు తాము బ్యాంక్ గ్యారెంటీ
ఇస్తామని, తమ అకౌంట్లను తెరిపించాలని
సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు
విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో జగన్ పైన కుట్ర
పూరితంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. తమ అకౌంట్లలోకి సిబిఐ
చెబుతున్న భారీ మొత్తంలో లావాదేవీలు
జరగలేదన్నారు.
అక్రమాలు
జరిగాయని భావిస్తే, అందుకు సంబంధించిన జివోలు ఎందుకు రద్దు చేయలేదన్నారు. సంబంధించిన
మంత్రులను, అధికారులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాగా ఇరువైపుల వాదనలు
విన్న అనంతరం కోర్టు తీర్పును 14వ తారీఖుకు వాయిదా
వేసింది. సోమవారం సిబిఐ కోర్టు సాక్షి
పిటిషన్లను కొట్టివేసింది. దీంతో
వారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
దాఖలు చేశారు.
0 comments:
Post a Comment