హైదరాబాద్:
తన కుమారుడు నారా లోకేష్, అల్లుడు
జూనియర్ ఎన్టీఆర్ - ఇద్దరినీ పార్టీ కోసం వాడుకోవడానికి తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
రాజీ ఫార్ములాను రూపొందిస్తున్నట్లు సమాచారం. పార్టీకి యువరక్తం అవసరమని భావిస్తున్న చంద్రబాబు నారా లోకేష్, జూనియర్
ఎన్టీఆర్ మధ్య హెచ్చుతగ్గుల తేడాలు
లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు
చెబుతున్నారు. దానికి ముందుగా బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణకు
కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీలో
మరింత పెద్ద బాధ్యతలు నిర్వహించడానికి
బాలకృష్ణ వచ్చే నెలలో సిద్ధపడతారని
అంటున్నారు. ఆయన పూర్తి స్థాయిలో
పోలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారని, ఆయనకు పార్టీ ప్రధాన
కార్యదర్శి పదవి గానీ, వర్కింగ్
ప్రెసిడెంట్ పదవి గానీ అప్పగిస్తారని
అంటున్నారు. దీంతో నందమూరి హరికృష్ణతో
పాటు బాలకృష్ణ కూడా పార్టీలో కీలకం
కానున్నారు. ఇరువురి మధ్య పొరపొచ్చాలు లేకుండా
తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారని అంటున్నారు.
బాలకృష్ణ
పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన
తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ క్రియాశీలక
పాత్రల్లోకి వస్తారని, వారిద్దరినీ బాలకృష్ణ నేతృత్వంలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. నారా లోకేష్‌తో
సమానమైన హోదాను కలిగిస్తూ బాబాయ్ బాలయ్య నాయకత్వంలో పనిచేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్దగా అభ్యంతరం
ఉండకపోవచ్చునని అంటున్నారు.
వచ్చే
ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడేనని బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు. నాయకత్వ మార్పును కూడా ఆయన తోసిపుచ్చారు.
చంద్రబాబును పెద్ద దిక్కుగా పెడుతూ
నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు
కలిసి పనిచేసే విధంగా ఓ ఫార్ములా తయారవుతున్నట్లు
చెబుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక వేదిక వస్తారని
బాలకృష్ణ ఇటీవల చెప్పిన విషయం
తెలిసిందే. కాగా, నందమూరి హీరోలు
కేవలం ప్రచారం కోసం మాత్రమేననే అభిప్రాయాన్ని
తొలగించి, వారు పార్టీలో కీలక
బాధ్యతలు నిర్వహిస్తారనే అభిప్రాయాన్ని కలిగించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు.
ప్రస్తుతం
చంద్రబాబుతో కలిసి పార్టీ పోలిట్‌బ్యూరోలో 16 మంది సభ్యులున్నారు. 11 మంది
ప్రధాన కార్యదర్శులున్నారు. పోలిట్‌బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఇటీవల పార్టీ
నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆమె
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment